రాజ్యసభ(Rajya Sabha)లో శనివారం ఉదయం భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర రభస చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేతకంటే ముందుగా చౌదరి చరణ్ సింగ్(Chaudhary Charan Singh) మనవడు, ఆర్‌ఎల్డీ అధినేత జయంత్ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏ నిబంధన ప్రకారం జయంత్‌కు ముందుగా మాట్లాడే అవకాశం కల్పించారని మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు చైర్మన్‌ను నిలదీశారు. దాంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) చౌదరి చరణ్‌సింగ్‌ను, ఆయన వారసత్వాన్ని మీరు అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. మల్లికార్జున్ ఖర్గే, జైరామ్ రమేశ్, ఇతర కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
గతంలోనే చరణ్‌సింగ్ సింగ్‌కు భారతరత్న ఇచ్చేందుకు మీకు టైమ్ దొరకలేదని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విమర్శించారు. రైతుల కోసం పాటుపడిన చరణ్‌సింగ్ గురించి చర్చ జరుగుతుంటే అడ్డుకోవడం ద్వారా దేశ రైతాంగాన్నే అవమానించారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు వాడుతున్న భాష సరిగ్గా లేదని ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
చరణ్‌సింగ్‌ను అవమానిస్తే తాను సహించనని, ఆయన దేశ సమగ్రత కోసం, ప్రజల క్షేమం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ చర్చలో జయంత్‌కు ఏ రూల్ ప్రకారం అవకాశం ఇచ్చారని మరోసారి ప్రశ్నించారు.