బీఆర్ఎస్ (BRS) ప్రభంజనాన్ని తట్టుకుని 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ (Congress) నేతల్లో జగ్గారెడ్డి (Jaggareddy) ఒకరు. మిగిలిన నేతలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నా ఈయన మాత్రం పార్టీని వీడలేదు. కానీ, అప్పుడో ఇప్పుడో పార్టీ మారడం ఖాయం అనే వార్తలు తరచూ వస్తుంటాయి. అయితే.. ఈసారి ఈ ప్రచారం పీక్స్ కు చేరింది. దీంతో జగ్గారెడ్డి కూడా ఓపెన్ అయ్యారు. పార్టీ పెద్దలకు కంప్లయింట్ ఇచ్చారు.
సొంత పార్టీ వాళ్లే తనను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మణిక్ రావు థాక్రే (Manikrao Thakrey) కు ఫిర్యాదు చేశారు జగ్గారెడ్డి. ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో థాక్రేతోపాటు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా తనపై కుట్ర జరుగుతోందని వివరించారు. ఏడాదిన్నర నుంచి పార్టీలో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. పార్టీ కోసం పనిచేస్తున్నా కూడా కోవర్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎక్కడికీ పోవడం లేదని.. పార్టీలోని వారే ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరంగా ఉందన్నారు జగ్గారెడ్డి. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని థాక్రేను కోరారు. పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానని, అయినప్పటికీ తనకు బీఆర్ఎస్ తో సంబంధాలు ఉన్నట్లు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని వాపోయారు.
జగ్గారెడ్డి ఫిర్యాదుపై దృష్టి పెట్టిన నేతలు.. మేం చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంశంపై దృష్టిపెట్టి… సమిష్టి కృషితో జెండా ఎగురువేయాలని జగ్గారెడ్డికి థాక్రే సూచించారు. నేతల సమన్వయం కోసం తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు. హై కమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.