గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పొందిన జగ్గారెడ్డి (Jagga Reddy) తన ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గెలుపు ఓటమిలు రాజకీయాల్లో శాశ్వతం కాదన్న జగ్గారెడ్డి.. ఓడిపోయామని కూర్చుంటే.. ఉనికిని కోల్పోతామని.. అందుకే ఓటమి నేర్పిన పాఠంతో తిరిగి పుంజుకోవాలని వెల్లడించారు.. ఈ క్రమంలోనే ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పిందని, ఈ 10 రోజులోనే ఇంకా చాలా అనుభవాలు నేర్చుకోన్నానని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి (Sangareddy) ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తోన్నట్టు వెల్లడించిన జగ్గారెడ్డి.. 5 సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేస్తే.. 3 సార్లు సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించారని తెలిపారు. 2014 లో మొదటి సారి ఓడిపోయినా.. ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పిందని.. 2023లో రెండోసారి ఓడిపోయినా.. ఈ ఓటమి నుంచి సైతం చాలా అనుభవాలు నేర్చేసుకున్నానని జగ్గారెడ్డి అన్నారు. అయితే ఓటమిని అందించి సంగారెడ్డి ప్రజలకు నాకు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారని తెలిపారు.
ఈ విరామం సమయంలో నేను పూర్తిగా పార్టీ ఆర్గనైజేషన్ కోసం పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు జగ్గారెడ్డి వివరించారు.. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కోసం శ్రమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు.. పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ కి పూర్తి సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొన్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు.
మరోవైపు తాను పదవిలో లేకపోయినా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు.. సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయన్నారు. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారిలోకి తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తోందని ఆశిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు..