జగిత్యాల (Jagityala) జిల్లా కోరుట్ల (Korutla) మండలం వెంకటాపురం (Venkatapuram) శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల నుంచి కోరుట్ల వైపు ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెంకటాపూర్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు.
దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వారు భవన నిర్మాణ పనుల కోసం ముగ్గురు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొందని సమాచారం..
మరణించిన వ్యక్తులను వేణు, శ్రీకాంత్, వెంకటేశ్‌గా గుర్తించారు. ఇక ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని గమనించే ఉంటారు. నిర్లక్ష్యం, మద్యం కారణంగా.. లేదా అతి వేగం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.. కారణం ఏదైనా మరణించిన కుటుంబాలకు మాత్రం తీరని శోకం మిగులుతుందనేది సత్యమని అంటున్నారు..