సమస్యకు చావు పరిష్కారం కాదు. కానీ నేటి రోజుల్లో అన్ని సమస్యలకు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే పోరాడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందులో వ్యాపార వేత్తలు, ఉన్నత విద్యావంతులు, నటీనటులే కాదు.. దాదాపుగా ప్రతి వారు కూడా సమస్య రాగానే బలవన్మరణం వైపు అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం కూడా ఇలాంటి ఘటనే జగిత్యాలలో (Jagityala) చోటు చేసుకొంది. శ్రీపాద ప్రసాద్ (Sripada Prasad) అనే గోల్డ్ స్మిత్ (goldsmith)జగిత్యాలలోని రాం బజార్ లో బంగారం వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలి దగ్గర ఐదు తులాల బంగారం కొనుగోలు చేశారు. అయితే అవి దొంగిలించిన బంగారం అని, మీరు 15 తులాల గోల్డ్ కట్టాలని పోలీసులు టార్చర్ పెట్టడంతో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నాని పాల్పడ్డారు.
వెంటనే స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గోల్డ్ రికవరీ పేరుతో పోలీసులు జువెలరీ షాప్ కి వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో కూడా పోలీసులు ఇలానే వేధించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది..