రాజస్థాన్(Rajasthan)లోని జైపూర్(Jaipur)జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీ(Chemical factory)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఐదుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
బస్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైనాడలో ఈ ఫ్యాక్టరీ ఉంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నచాలా మంది కూలీలు గాయాలపాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.
వారికి చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఘటనాస్థలంలో ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. బస్సీ ఏసీపీ ముఖేష్ చౌదరి మాట్లాడుతూ.. బాయిలర్ పేలుడు కారణంగానే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు తెలిపారు.
ఈ సమయంలో ఇక్కడ పనిచేస్తున్న ఐదుగురు కూలీలు నేరుగా బాయిలర్ దగ్గరే ఉండడంతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేయగలిగారని తెలిపారు.