Jamili Elections Committee: జమిలి ఎన్నికల కోసం కేంద్రం కీలక నిర్ణయం
2024లో సార్వత్రిక ఎన్నికలు (General Elections) రానున్నాయి. కానీ బీజేపీ ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపధ్యంలోనే జమిలి ఎన్నికల (Jamili Elections) సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ (Ramnadh Kovind) కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2017లో రాష్ట్రపతి అయిన రామ్‌నాథ్ కోవింద్ కూడా జమిలి ఎన్నికల అంశంపై మోదీ అభిప్రాయానికి మద్దతు పలికారు.
ఒకేసారి లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు (వన్ నేషన్-వన్ ఎలక్షన్)’ పేరుతో సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ కమిటీలో 8 మంది సభ్యులతో ఒక నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ కమిటీలో కేంద్రమంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాశ్ కశ్యప్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉండనున్నారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్న తర్వాతి రోజునే జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే పార్లమెంట్ సమావేశాల అజెండాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. లోక్‌సభను రద్దుచేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతున్నది.
1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి.