జమ్మూ-శ్రీనగర్ (Jammu Srinagar)లో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా పరిస్థితులు తీవ్రంగా మారాయి. వీటి ప్రభావంతో రాంబన్ (Ramban) జిల్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ (Kashmir)ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడినట్లు వెల్లడించారు.
ఈ కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయని.. అనేక చోట్ల గత మూడు రోజులుగా కొండచరియలు విరిగిపడటంతో రహదారిని పునరుద్ధరించే ప్రయత్నాలు విజయవంతం కాలేదని అధికారులు తెలిపారు. బనిహాల్-రాంబన్ సెక్టార్‌లో చిక్కుకుపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి బుధవారం మధ్యాహ్నం ట్రాఫిక్ పాక్షికంగా పునరుద్ధరించబడిందన్నారు. అయితే, కిష్త్వారీలో భారీ కొండచరియలు విరిగిపడటంతో హైవే మళ్లీ బ్లాక్ చేయబడినట్లు పేర్కొన్నారు.
మరోవైపు శ్రీనగర్-లడఖ్ మార్గంలో కుప్వారా- గురెజ్‌లోని నియంత్రణ రేఖ (LOC) ప్రాంతాలను కలిపే రహదారులతో పాటు అనేక ఇతర ప్రధాన రహదారులు భారీ హిమపాతం కారణంగా మూసివేయబడ్డాయి. కిష్త్వారీ పథేర్, బనిహాల్ వద్ద సైతం పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. అదీగాక నష్రీ, బనిహాల్ మధ్య అనేక ప్రదేశాలలో అడపాదడపా కొండ చర్యలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి ఇప్పటికీ క్లోజ్ చేశారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈమేరకు జాతీయ రహదారి-44 (NH-44)లో ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ప్రయాణించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇప్పటికే కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో భారీగా హిమపాతం కురుస్తుండటంతో అధికారులు హెచ్చరికలను సైతం జారీ చేశారు. ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సోనామార్గ్ ప్రాంతంలోని సింధ్ నదిలో నిన్న భారీ హిమపాతం కురిసింది. దీనివల్ల తన గమనాన్ని మార్చుకొన్న నది.. పక్కనే ఉన్న శ్రీనగర్-లడఖ్ రహదారిపై ప్రవహించింది.
ఈ క్రమంలో అధికారులు యంత్రాలను ఉపయోగించి, నది నీటిని, దాని అసలు మార్గం వైపు మళ్లించారు. హిమపాతాన్ని క్లియర్ చేశారు.. అయితే ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ల నుంచి రోడ్డు పరిస్థితులను నిర్ధారించుకున్న తర్వాతే ప్రజలు NH-44లో ప్రయాణించాలని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు..