రాబోయే ఎన్నికల్లో తాను పార్లమెంట్ (Parliament) బరిలో ఉంటానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి (Jana Reddy) తెలిపారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ప్రజలకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. అసలు రాష్ట్రంలో ఉచిత కరెంట్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు.
గత ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా పోటీ చేయాలని సవాల్ విసిరితే బీఆర్ఎస్ స్వీకరించలేదన్నారు. ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు శత విధాల ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి దగ్గర ఫలితం సాధించారని వెల్లడించారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గాను తన వారసులను తయారు చేస్తున్నానన్నారు.
60 ఏండ్ల పాలనలో తెలంగాణలో కాంగ్రెస్ రూ. 75 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. కానీ కేవలం తొమ్మిదేండ్లలోనే బీఆర్ఎస్ సర్కార్ రూ. 5 లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు. దేశంలో తొమ్మిదేళ్లలో రూ.112 లక్షల కోట్లను ప్రధాని మోడీ ఖర్చు చేశారని అన్నారు. మోడీ, కేసీఆర్‌లు చేసిన అవినీతిపై ఒకరిపై మరొకరు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వైపు రైతుబంధు పేరుతో రైతులకు డబ్బులు ఇస్తూ మరో వైపు లిక్కర్ పై ధరలు పెంచి ఒక్కో కుటుంబం నుంచి రూ.40వేల వరకు వసూలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.