బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy)మరో వివాదంలో ఇరుక్కున్నారు. దళిత బంధు (Dalit Bandhu)కు సంబంధించి ఆయనపై దూల్మిట్ట, మద్దూరు గ్రామాలకు చెందిన దళితులు ఆరోపణలు చేస్తున్నారు.
దళిత బంధు ఇప్పిస్తానని చెప్పి 67 మంది నుంచి ఒక్కో యూనిట్‌కు లక్ష రూపాయాలు చొప్పున తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మద్దూర్ మండల ఎంపీపీ, బీఆర్ఎస్ నేత బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దళితులు హనుమంతపూర్లోని ముత్తి రెడ్డి ఫాం హౌస్ ను ముట్టడించారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు దళిత బంధు రాలేదని వెల్లడించారు. అందువల్ల తమ డబ్బులను తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
దళిత బంధు కోసం ఈ డబ్బులను ఇచ్చినందున తమ వద్ద రసీదులు లేవని అన్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
డబ్బులు ఇచ్చిన వారిలో కేవలం ఒక్కరిద్దరికి మాత్రమే దళిత బంధు వచ్చిందని అన్నారు. ఆ డబ్బులు రావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ముత్తి రెడ్డి డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని హరీశ్ రావు దృష్టికి కూడా తీసుకు వెళ్లామని చెప్పారు. అయినప్పటికీ ముత్తి రెడ్డి సరిగా స్పందించడం లేదని వాపోయారు.