– కొలిక్కి వచ్చిన బీజేపీ, జనసేన పొత్తు
– ఈ బంధం బీజేపీకి కలిసొస్తుందా?
– అసలు, తెలంగాణలో జనసేనకు ఉన్న బలమెంత?
– బీజేపీ అంచనాలేంటి..?
– చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి మోడీ, పవన్
తెలంగాణ (Telangana) లో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యంగా ముందుకెళ్తోంది బీజేపీ (BJP). అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఎన్డీఏ (NDA) లో భాగస్వామిగా ఉన్న జనసేన (Janasena) పార్టీతో పొత్తు పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వచ్చింది. జనసేనకు 10 సీట్లు కేటాయించింది బీజేపీ. మరో రెండు స్థానాలపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. మోడీ (Modi) మూడోసారి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్టు దానికోసం ఈ అసెంబ్లీ ఎన్నికలు బలమైన పునాది వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).
7న మోడీ సభతో యుద్ధం మొదలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. 7న సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్ర నాయకత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఇదే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోడీతో పవన్ సభను పంచుకోవడం ఇదే తొలిసారి. ఈ సభ ద్వారా బీజేపీ, జనసేన ఉమ్మడి పోరాటం మొదలు అవుతుందని ఇరు పార్టీల శ్రేణులు చెబుతున్నాయి.
తెలంగాణలో జనసేనకు అంత సీనుందా?
2014లో జనసేన ప్రస్థానం మొదలైంది. పార్టీ స్థాపించింది తెలంగాణ గడ్డపైనే అయినా.. జనసేన అప్పుడు పోటీ చేసింది లేదు. ఆ సమయంలో బీజేపీ, టీడీపీకి మద్దతు పలికారు. తెలంగాణలో కొన్ని స్థానాలు సాధించినా.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్.. ఎక్కువగా ఆంధ్రాపైనే ఫోకస్ పెట్టారు. తెలంగాణలో పార్టీ ఏపీలో ఉన్నంత యాక్టివ్ గా లేదు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఏపీలో పోటీ చేసింది జనసేన. పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కేవలం ఒక్క స్థానంలోనే పార్టీ గెలిచింది. తెలంగాణలో అయితే.. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసింది లేదు. జనంలో ఫాలోయింగ్ ఉన్న సరైన లీడర్ కూడా లేరు. అలాంటి జనసేనతో పొత్తు కోసం బీజేపీ తాపత్రయపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నారు.
సినిమాలు వేరు.. రాజకీయం వేరు
తెలంగాణలో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. పవన్ సినిమా హిట్ అయితే.. ఏపీలో కంటే తెలంగాణలోనే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అలాగని రాజకీయాల్లో అదే స్థాయిలో ఓట్లు రాలడం కష్టమేననేది రాజకీయ పండితుల వాదన. గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టగా.. తెలంగాణ నుంచి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవికి కూడా అంతే.. సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించే జనాలు.. రాజకీయాల్లో మాత్రం ఓట్లు కురిపించలేదు. పవన్ పరిస్థితి కూడా ఇదేనని.. అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు.
బీజేపీ లెక్కలు వేరే!
2014 జనసేనకి.. 2023 జనసేనికి చాలా తేడా ఉందనేది బీజేపీ నాయకుల వాదన. ఏపీలో గ్రామస్థాయిలో బలోపేతం అయిందని భావిస్తున్నారు. అలాగే, తెలంగాణలో ఉన్న పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈసారి ఓట్ల రూపంలోకి మారతాయని అనుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం వల్లే తాము సత్తా చాటగలిగామని స్వయంగా లక్ష్మణ్ చెబుతున్నారు. అందుకే, జనసేనతో పొత్తుపై ఎన్ని విమర్శలు వచ్చినా.. తమకు లాభమే తప్ప నష్టం కాదని భావిస్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు.