బలిదానాల తెలంగాణ ( Telangana)లో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) అన్నారు. తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తన గుండె చప్పుడు అని తెలిపారు. ఇకపై తాను తెలంగాణలో అడుగు పెడుతున్నానని వెల్లడించారు. ఆంధ్రా తనకు జన్మనిచ్చిందని, తెలంగాణకు తనకు పునర్జన్మ నిచ్చిందన్నారు.
హనుమకొండ హాంటర్ రోడ్డులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని మండిపడ్డారు. ఏపీలో గుండాల పాలన నడుస్తోందన్నారు. తెలంగాణ ధైర్యంతోనే తాను ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు.
అలాంటి పరిస్థితులను కూడా తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని వెల్లడించారు. ఈ పదేండ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదన్నారు. ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఏపీలో లాగానే తెలంగాణలోనూ తిరుగుతానన్నారు.
నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను కూడా ఉన్నానన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజలకు సమస్య వస్తే తాను అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామన్నారు. కనీసం బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలన్నారు. అందుకే బీజేపీతో కలిసి పని చేస్తున్నామన్నారు.
బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామన వివరించారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమన్నారు.