తెలంగాణ (Telangana) బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత (Kavitha).. ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి కూడా కోల్పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా.. ఎమ్మెల్యే జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ తో కలిసి పాల్గొన్న జీవన్ రెడ్డి (Jeevan Reddy).. కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత ఏంది అసలు నాకు అర్ధం కాదన్న జీవన్ రెడ్డి.. బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లా? అని ప్రశ్నించారు. మేం హిందూమతంతో పాటు అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొన్న జీవన్ రెడ్డి.. కవిత ఎన్ని గుళ్లను కాపాడగలిగిందో తెలపాలని డిమాండ్ చేశారు. జగిత్యాల రామాలయం గుడి ఆక్రమణకు గురి కాకుండా కాపాడింది తామేనని జీవన్ రెడ్డి తెలిపారు. ధరూర్ క్యాంపులో ఎమ్మెల్యే చేతులు ఎత్తేస్తే నేను హనుమాన్ టెంఫుల్ కాపాడానని క్లారిటీ ఇచ్చారు.
దొరసాని ఎమ్మెల్సీ కవిత 5 యేండ్లు పదవిలో ఉండి సింగరేణికి ఏం చేసిందని మండిపడ్డ జీవన్ రెడ్డి.. సంస్థ నష్టాల్లోకి వెళ్తుంటే దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ఏం చేయలేదని విమర్శలు చేశారు.. చక్కగా ఉన్న చక్కర ఫ్యాక్టరీ మూసేయించిందని, కానీ దానిని మేము తెరిపించబోతున్నామని జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి తనయగా ఆమె ఆర్భాటం తప్ప.. ప్రజలకి ఉపయోగపడే పనులు ఏం చేయలేదని జీవన్ రెడ్డి మండపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి.. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేసి తీరుతామని తెలిపిన జీవన్ రెడ్డి.. దొరసాని పుణ్యం వల్ల పదేండ్లలో బొగ్గు గని కార్మిక సంఘం రద్దు అయిపోయిందని ఆరోపించారు.. కాగా సింగరేణి ఎన్నికల్లో మిత్రపక్షం గెలవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా జీవన్ రెడ్డి పేర్కొన్నారు.