ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే(Armur Ex MLA), బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి(JeevanReddy)కి మరో షాక్ తగిలింది. రూ.20కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని మామిడిపల్లి(Mamidipally)లోని ఆయన ఇంటికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్(State Finance Corporation)అధికారులు నోటీసులు అతికించారు. నిర్ణీత సమయంలో రుణం చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీవన్‌రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. జీవన్‌రెడ్డి 2017లో తన భార్య పేరిట లోన్ తీసుకున్నారు. రూ.20 కోట్ల రుణం తీసుకుని.. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా వడ్డీ కట్టలేదు. వడ్డీ, లోన్ కట్టాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా జీవన్ రెడ్డి స్పందించకపోవడంతో అధికారులు ఆయన ఇంటికి నోటీసులు అతికించినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ డిపో పక్కన కోట్ల రూపాయల విలువైన స్థలం ఆర్టీసీకి ఉంది. ఆ స్థలాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కొందరు లీడర్లు లీజుకు తీసుకున్నారు. దానిని ఓ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పేరు మీద అప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్ రెడ్డి తన సతీమణి పేరు మీద లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 20 కోట్ల రుణంతో కాంప్లెక్స్ నిర్మించారు.
ఆ కాంప్లెక్స్ ద్వారా ప్రతీనెల లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా.. ఆర్టీసీకి లీజు అగ్రిమెంట్ ప్రకారం బకాయిలు చెల్లించలేదు. దాంతో ఆర్టీసీ అధికారులు బకాయుల కోసం చాలా సార్లు ఒత్తిడి తెచ్చారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యే కావడంతో లీజు బకాయిల వసూలుకు అధికారులు వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆయన ఓడిపోవడంతో నోటీసులు పంపడం గమనార్హం.
ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ, కార్పొరేషన్స్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇలా అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాజకీయ నాయకులు ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయాలను వ్యాపారం చేయడం ఈ దేశానికి పట్టిన దరిద్రమని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద సరైన విధానం తీసుకోవాలంటూ రాసుకొచ్చారు.