ఝార్ఖండ్(Jharkhand) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్(CM Hemant Soren)ను ఈడీ(ED) అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. దాదాపు ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం ఈడీ అధికారులు సోరెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు.
అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో జేఎంఎం సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈడీ సమన్లపై హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ ఝార్ఖండ్ హైకోర్టు విచారించనుంది.
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరింది. దీనికి సంబంధించి ఝార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది. హేమంత్‌ను ఈడీ అధికారులు 7 గంటలకుపైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా హేమంత్ సోరెన్ సమాధానాలివ్వలేదని తెలిసింది.
అరెస్టుకు ముందు సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. హేమంత్ రాజీనామాను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడం వల్ల చివరకు పార్టీ సీనియర్ నేత చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు హేమంత్ సోరెన్ అరెస్టుపై బీజేపీ స్పందించింది. ఇండియా కూటమిలోని మరో అవినీతి చేప వలలో చిక్కిందని వ్యాఖ్యానించింది. గతంలో లాలూ ప్రసాద్, సోరెన్, సోనియాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెఇ్జాద్ పూనావాలా విమర్శించారు.
హేమంత్ సోరెన్‌తో బలవంతంగా రాజీనామా చేయించడం సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ప్రభుత్వ సంస్థలుగా కాకుండా ప్రతిపక్షాలను లేకుండా చేసే అధికార బీజేపీ విభాగాలుగా తయారయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఇండియా కూటమి నాయకులు బుధవారం సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై చర్చించారు.