ప్రపంచంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని సార్లు నిరాశపరిచినా ఎప్పుడోసారి అదృష్టం తలుపుతడుతుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతుంటారు. అదే నిజమైతే మామూలుగా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిద్రకూడా పట్టదు. మన దేశంలో కేరళ లాటరీల్లో ఇలాగే జరుగుతుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఓ యువ వ్యాపారి ఒకటి, రెండు కోట్లు కాదండోయ్.. రూ.795కోట్ల లాటరీని గెల్చుకుని కోటీశ్వరుడయ్యాడు. చైనా(china)లోని ఓ 28 ఏళ్ల యువ వ్యాపారి ఆ దేశంలోనే అత్యధిక విలువైన 680 మిలియన్ యువాన్ (యుఎస్డి 96 మిలియన్) రూ.795.84 కోట్ల లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఇది ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్దది(Biggest Lottery) కావడం విశేషం.
ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అతను తన లాటరీ ఆదాయంలో ఐదవ వంతు పన్ను చెల్లించాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. ప్రభుత్వ మద్దతు గల ఆర్గనైజర్ చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ ప్రకారం విజేత నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌కు చెందినవాడు. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మంగళవారం ఈ మేరకు వెల్లడించింది.
అతడు ఒక్కొక్కటి రెండు యువాన్ల (USD 28 సెంట్లు) చొప్పున 133 టిక్కెట్లను కొనుగోలు చేశాడు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్‌పై బెట్టింగ్ చేశారని పేర్కొన్నారు. అతడి ప్రతి టిక్కెట్‌కు 5.16 మిలియన్ యువాన్ (USD 725,000) బహుమతి లభించిందని అక్కడి మీడియా తెలిపింది. అయితే విజేత పేరు వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఫిబ్రవరి 7న ఈ ప్రైజ్ మనీని అందజేసినట్లు ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి ఒకరు తెలిపారు.