ఇజ్రాయెల్ (Israel) దాడులతో గాజా (Gaza)లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అయితే, ఆకలితో అల్లాడుతున్న గాజావాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడువనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ప్రకటించారు.
మరోవైపు మానవతా సాయం(Humanitarian aid) కోసం ఎదురు చూస్తున్న అమాయకులపై ఐడీఎఫ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. “ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరం. సాయం అందించేందుకు అమెరికా సిద్దంగా ఉంది” అని బైడెన్ తెలిపారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అదేవిధంగా ‘రెడీ టూ మీల్స్’ ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా ఎయిర్ డ్రాప్ చేయనుంది. ఈ ఆహార పంపిణీ నిరంతర ప్రక్రియ అని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జోర్డాన్, ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు ఇప్పటికే గాజాలోకి ఆహార పొట్లాలను జారవిడిచాయి. మానవతా సాయం ఫలాలు అందరికీ అందాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా చెకోపోస్టు తెరుచుకుంటేనే అది జరుగుతుంది.. లేదంటే ఈ చర్య అంతగా ప్రభావం చూపకపోవచ్చని మరొక అమెరికా అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే, గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులు తీవ్ర పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆహార కొరత ఏర్పడి రోజుల తరబడి పస్తులు ఉంటున్నారు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే రోజుకు 500 ఫుడ్ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. జనవరిలో రోజుకు 150.. ఫిబ్రవరిలో 97 ట్రక్కులు మాత్రమే గాజాలోకి ప్రవేశించాయి.