– ఒక్క ఛాన్స్ ఇవ్వండి
– అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
– పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడింది
– కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించాం
– తెలంగాణలో కూడా చేసి చూపిస్తాం
– జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ (KCR) ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని విమర్శించారు. గురువారం నిజామాబాద్ (Nizamabad) లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో బీజేపీ (BJP) బహిరంగ సభ జరిగింది. ఇందులో పాల్గొన్న నడ్డా.. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. దళితబంధులో గులాబీ లీడర్లు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ (Telangana) లో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు నడ్డా. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదన్న ఆయన.. బీజేపీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకిందని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించామని.. తెలంగాణలో కూడా చేసి చూపిస్తామని చెప్పారు.
కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో పాటు దేశంలోని కుటుంబ పాలనకు అంతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు నడ్డా. అత్యధిక మైనారిటీలు తెలంగాణలో ఉన్నారని… ధరణి పోర్టల్ కేసీఆర్ ఆక్రమణలకు పోర్టల్ గా మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏటీఎంగా మారిందన్న ఆయన… దళితబంధు లాంటి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లను ఊహా లోకంలో కట్టారని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రకటించారని.. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు జేపీ నడ్డా. కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదని విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.