తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ (BJP) దూకుడు ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. సకల జనుల విజయసంకల్ప సభ పేరుతో నిర్వహిస్తున్న సభలో బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు లాంటి దొరలదే అధికారమని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు అందినకాడికి దోచుకున్నారని.. అది చాలదన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకుని కేసీఆర్ అండ్ టీమ్ దోపిడీకి పాల్పడినట్టు ఆరోపించారు జేపీ నడ్డా.. ఇలాంటి కుటుంబపార్టీలు జమ్మూకశ్మీర్, బీహార్, యూపీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయని.. రాబోయే ఎన్నికల్లో కుటుంబపాలనను ఓటు అనే ఆయుధంతో మట్టుపెట్టాలని జేపీ నడ్డా కోరారు.
కేసీఆర్ అవినీతి వల్ల కేంద్రం ఇచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపిన జేపీ నడ్డా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రద్దు చేసిన..తెలంగాణలో ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగిందని జేపీ నడ్డా ఆరోపించారు. దళితబంధు రావాలంటే ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందన్న జేపీ నడ్డా.. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని వెల్లడించారు..