జూబ్లిహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ తుది ఫలితాలను ఈ రోజు ప్రకటించారు. జూబ్లి హిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) గెలుపొందినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఫిర్యాదు నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియను ఆపి వేశారు. తాజాగా ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ఎన్నికల సంఘం ప్రకటించింది.
అంతకు ముందు జూబ్లిహిల్స్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపింది. చివరకు మాగంటి గోపినాథ్ స్పష్టమైన మెజారిటీ సంపాదించారు. లెక్కింపు సమయంలో పలుమార్లు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈవీఎంలపై అజారుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. 11వ రౌండ్ లో 2ఈవీఎంలు, 12వ రౌండ్ లో మరో రెండు ఈవీఎంలు, 13 వ రౌండ్ లో 1 ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది.
ఈ కారణంగా ఓట్ల లెక్కింపును అధికారులు తాత్కాలికంగా నిలిపి వేశారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, సంబంధిత పార్టీ ప్రతినిధులకు ఎన్నికల నిబంధనలు వివరించి కౌంటింగ్ కొనసాగించారు. మొత్తం 26 రౌండ్లు పూర్తయిన తర్వాత నిలిచి పోయిన వీవీ ప్యాట్ల లెక్కింపును అధికారులు తిరిగి ప్రారంభించారు. మొత్తం 26 రౌండ్లు పూర్తయ్యే సమయానికి మాగంటి గోపినాథ్ 16,490 వేల మెజార్టీ ఉండగా, పోస్టల్ బ్యాలెట్ లో 153 ఓట్ల మెజార్టీ తగ్గింది.
చివరకు 16వేల 337 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొత్తం 16వేల 337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 63 వేల 8385 ఓట్లు రాగా, మాగంటి గోపీనాథ్‌కు 80వేల 328 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25వేల 756 ఓట్లు, ఎంఐంఎం అభ్యర్థి ఫలాజుద్దీన్ 7వేల 829 ఓట్లు సాధించారు.