మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పుడు, ఇప్పుడు అంటూ కొద్ది రోజులుగా చేరికపై కన్ఫ్యూజన్ నెలకొనగా.. ఢిల్లీలో తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఈయనతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురు నాథ్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లో చేరికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జూపల్లి. పొంగులేటి మాదిరిగా భారీ బహిరంగ సభ నిర్వహించి.. జనసందోహం నడుమ హస్తం గూటికి చేరాలని అనుకున్నారు. సభ అదిగో ఇదిగో అంటూ వార్తలు వచ్చాయి. గత నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవాలని భావించగా వాయిదా పడింది. అదే నెల 30న మరో ముహూర్తం చూశారు. అది కూడా కలిసిరాలేదు. తర్వాత, ఈనెల 5న కాంగ్రెస్ లో చేరాలని భావించారు. చివరకు రెండు రోజుల ముందే ఢిల్లీలో సైలెంట్ గా చేరాల్సి వచ్చింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరుతున్నామని ఒకేసారి ప్రకటించారు. పొంగులేటి వెంటనే చేరినా, జూపల్లికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే అనేక వార్తలు తెరపైకి వచ్చాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్ తో పాటు మరికొన్ని టికెట్లు ఆశిస్తున్నట్టు.. దాన్నినాగం జనార్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రావు తీవ్రంగా వ్యతిరేకించినట్టు ప్రచారం సాగింది. అందుకే, జూపల్లి చేరిక వాయిదా పడుతూ వచ్చిందని అనుకుంటున్నారు.
ఒకానొక సమయంలో ఆయన కాంగ్రెస్ లో చేరతారా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ, ఎట్టకేలకు ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ చేతిలో చెయ్యేశారు జూపల్లి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా పలువురు నేతలు హాజరయ్యారు.