ఏపీ(AP)లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)లో సీట్ల మార్పు వ్యవహారంతో ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని తెలిసిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అదనుచూసి ఇతర పార్టీలోకి జంప్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టికెట్ విషయమై ముందుగానే ఓ మాట చెప్పి ఉంచుతున్నారు.
తాజాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తి అయినట్లు సమాచారం. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుఫున జగ్గంపేట నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్‌గా చంటిబాబును నియమించారు.
జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి రావడంతో చంటిబాబు అప్పట్లో టీడీపీకి గుడ్‌బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. అయితే, జగ్గంపేట స్థానం ఈసారి చంటిబాబుకు సీటు గ్యారంటీ లేదనే చర్చ నడుస్తోంది. తాను కానీ, తన కుటుంబానికి చెందిన వారు కాకుండా బయటి వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చిచెప్పినప్పటికీ ప్రత్యామ్నాయంగా వేరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 5 లేదా 6 తేదీల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే, ఇటీవల చంటిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ‘పార్టీలు, గాడిద గుడ్డు.. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. మేం ఏమైనా ఈ పార్టీలో శాశ్వతమా? అంటూ ఆయన హాట్ కామెంట్లు చేయడం గమనార్హం.