స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(KADIAM SRIHARI) ఇటీవల బీఆర్ఎస్ (BRS) పార్టీని వీడి అధికార కాంగ్రెస్(CONGRESS) పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అతని కూతురు కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పోటీకి రెడీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఎంపీ టికెట్ కేటాయించింది.దీంతో మంగళవారం తన నియోజకవర్గంలో కడియం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. తన కూతురికి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కొన్ని అనివార్య కారణాలతో పార్టీ మారాల్సి వచ్చిందని, ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నట్లు కడియం వివరించారు. కాంగ్రెస్ హవాలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు.అలాగే తన కూతురిని కూడా ఆశీర్వదించాలని కడియం కోరారు.
ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీని ఎదుర్కోలేవని,బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని కడియం ఆరోపించారు. బీజేపీ హయాంలో ముస్లిం మైనార్టీలు, దళితులు సంతోషంగా లేరని, మణిపూర్ అల్లర్ల ఘటన దేశానికే మాయని మచ్చగా మిగిలిందన్నారు.
ఇక పార్టీ మారిన తనపై బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ను వీడడం బాధగా ఉన్నా.. కేసీఆర్ పట్ల విమర్శలు చేయదల్చుకోలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కావ్య మూడో స్థానానికే పరిమితం అవుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి అంటున్నారని.. నీ మనవరాలు వయసున్న యువతి చేతిలో పాలకుర్తిలో ఒడిపోయావు. ఈ అహంకారపు, బలుపు మాటలు తగ్గించుకోవాలని హితవు పలికారు.ఇక పల్లా రాజేశ్వరరావు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
వాటిని నిరూపించకపోతే బట్టలూడదీసి జనగామ చౌరస్తాలో నిలబెడతానని హెచ్చరించారు. ఆయన వల్లే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందన్నారు. ఇక మాన నకొండూరులో ప్రజలు పండబెట్టి తొక్కితే రసమయికి పేగులు బయటకొచ్చాయి.50వేల ఓట్ల తేడాతో ఓడిపోయి సిగ్గులేకుండా నా ఇంటి దగ్గర సావుడప్పు కొడతాడట అని కడియం ఘాటు విమర్శలు చేశారు.