తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) కడియం శ్రీహరి(Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress)కు బొటాబొటి మెజార్టీ ఉందని, ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు సాధారణమని, వాళ్లపై వాళ్ళకే నమ్మకం లేదన్నారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ కార్మికులంతా ఏడాది పాటు ఓపిక పట్టాలని కడియం శ్రీహరి సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్యంపై దాడి చేసేందుకు సింహం రెండడుగులు వెనక్కి వేసిందని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కాంగ్రెస్ ప్రకటించిన హామీలకు ఏమాత్రం సహకరించదని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక్కటవుతారని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కడియం జోస్యం చెప్పారు. ఏడాది పాటు ఓపిక పడితే ఫలితం కనిపిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్‌కు మంచి రోజులు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు భరోసానిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు, దాని మిత్రపక్షం ఎంఐఎంకు ఏడు సీట్లు, బీజేపీకి ఎనిమిది సీట్లు ఉన్నాయని.. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదని చెప్పారు.
అయితే, తాను చెప్పిన మాటను వక్రీకరించి కాంగ్రెస్ వాళ్లే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని కడియం అన్నారు. వారిపై వారికే నమ్మకం లేనందునే భయంతో అలా చేస్తున్నారని తెలిపారు. అందుకే తాము ఒకటి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్లు పది ప్రచారం చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఉసిరికాయకట్ట లాంటిదని కడియం ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తెరిపిస్తే ఏం అమలు చేస్తాడో తెలియదా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సెటైర్లు విసిరారు.