Kailash : మహాదేవుడు, పరమశివుని నివాసంగా భావించే కైలాస పర్వతానికి భారత దేశంవైపు నుంచి కొత్త మార్గాన్ని నిర్మిస్తున్నారు. అభేద్యమైన కొండ ప్రాంతాల నుంచి కైలాస పర్వతాన్ని చేరుకోవడం సులభమేమీ కాదు. బౌధ్ధులు , హిందువులకు పరమ ఆరాధ్య దేవుడైన శివుడు టిబెట్ పరిధిలోని ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడని భావించే ఈ మహోన్నత శిఖరానికి చేరుకోవడమంటే స్వర్గధామాన్ని చేరుకున్నట్టేనని భావిస్తారు. హిమాలయాల సమీపంలో.. సముద్ర మట్టానికి సుమారు 22 వేల అడుగుల ఎత్తున ఉన్న కైలాస పర్వతాన్ని కొద్దిమంది మాత్రమే చేరుకోగలుగుతారు.
ఎందుకంటే తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ప్రయాణించడం అతి కష్టమైన పని. నడక మార్గంలో వెళ్లినా మూడు రోజులపాటు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది . అయితే లక్షలాది భక్తుల కోర్కె మేరకు కైలాస యాత్రకు కొత్త మార్గం అందుబాటులోకి రానుంది. సెప్టెంబరు నుంచి ఈ మార్గంలో భక్తులు యాత్ర చేయవచ్చు. ఇందుకు ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లా నుంచి చైనా బోర్డర్ వరకు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ మొత్తం రూట్ అంతా అభేద్యంగా ఉంటుంది.
నడక మార్గం ఏ మాత్రం అనువుగా ఉండదు గనుక గుర్రాలపైన వెళ్ళవలసి ఉంటుంది. ఈ మార్గాన్ని మూడు భాగాలుగా చేపడుతున్నారు. పితోర్ గఢ్ నుంచి తవాఘాట్ వరకు, అక్కడి నుంచి ఘటియాబ్ గఢ్ వరకు రెండు వరుసల దారితో బాటు ఘటియాబ్ గఢ్ నుంచి లిపు లేఖ్ కనుమ వరకు మరో రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
కైలాస పర్వతంలో మానవుడు ఊహించని అద్భుతమైన గుహలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక ఈ మార్గంలో మానస సరోవర్ సరస్సును కూడా చూడవచ్చు. స్వచ్ఛమైన నీటితో కూడిన ఈ సరస్సు ప్రపంచ సరస్సులలోకెల్లా అత్యుత్తమయినదని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని సందర్శించ గోరే భక్తులకు .. ఈ కొత్త మార్గం ఎంతో అనువైనదిగా ఉంటుంది. సెప్టెంబరు నుంచి వారు తమ యాత్రకు సంబంధించి ప్లాన్ చేసుకోవచ్చు.