కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్(ENC)గా కొట్టె సుధాకర్ రెడ్డి(Kotte Sudhakar Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు రామగుండం కేంద్రంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో నల్లా వెంకటేశ్వర్లు కొనసాగారు.
గత వారం ఆయనను సర్వీసు నుంచి టెర్మినేట్ చేస్తూ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొట్టె సుధాకర్‌రెడ్డిని నియమించారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి జగిత్యాల సర్కిర్ చీఫ్ ఇంజనీర్ పనిచేస్తున్నారు.
నల్లా వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేసిన తర్వాత అదనపు బాధ్యతలను ప్రభుత్వం సుధాకర్ రెడ్డికి అప్పగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆయనకే ఈఇన్‌సీ బాధ్యతలు ముట్టజెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కావడంతో ప్రస్తుతం రిపేర్ పనులను పర్యవేక్షించే బాధ్యత సుధాకర్‌రెడ్డిపై ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్ళినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ మొదలు ప్రారంభోత్సవం వరకు మొత్తం వ్యవహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో సుధాకర్ రెడ్డి వివరించారు. విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగినప్పుడు కూడా డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతనకు మేడిగడ్డ విషయాలను వివరించిన వారిలో నల్లా వెంకటేశ్వర్లుతో పాటు సుధాకర్‌రెడ్డి ఉన్నారు.