తెలంగాణ(Telangana) ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) గురించి తవ్విన కొద్ది సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేధావులు కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని అనాలోచిత నిర్ణయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోవటం ఖాయమని.. తెలంగాణ సమాఖ్య, తెలంగాణ పరిరక్షణ వేదిక మేధావులు అభిప్రాయపడ్డారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న పలువురు మేధావులు కాళేశ్వరం ప్రాజెక్టు లో అడుగడుగునా లోపాలు బయటపడుతున్నాయని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని విస్మరించి.. లోపాలను కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్న లోపాలను ఆధారాలతో సహా.. నీటిపారుదల శాఖ ఇంజనీర్, హైకోర్టు న్యాయవాది దొంతుల లక్ష్మీనారాయణ బట్టబయలు చేసి… ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలకవ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టే ముందు ఏరియల్ సర్వే చేసిన ప్రభుత్వం.. సమగ్ర గ్రౌండ్ సర్వే చేయక పోవడం వారి తెలివికి నిదర్శనమని తెలిపారు.
మరోవైపు కరుణాకర్ దేశాయ్ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ తనే ఒక ఛీఫ్ ఇంజనీరుగా అవతారమెత్తి తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు సైట్ మార్చడం పెద్ద తప్పని.. 2014 లో అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కేవలం రూ. 30 వేల కోట్లతో పూర్తి కావలసి ఉండగా.. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో రూ. ఒక లక్షా 30 వేల కోట్లకు పెంచిన ఘనుడు కేసీఆర్ (KCR)అని మండిపడ్డారు. అంచనాలు పెంచి లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేయడం ప్రభత్వ పెద్ద తెలివికి నిదర్శనం అని కరుణాకర్ దేశాయ్ ఆగ్రహించారు..
కోట్ల కొలది ప్రజాధనం వృధా చేసిన వారిపై తక్షణమే తగిన చర్య తీసుకోవాలని మేధావులు డిమాండ్ చేశారు.. తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని.. లేకుంటే తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశం ఉందని మేధావులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెట్టే వారిపై కేసులను పెట్టడడం పరిపాటిగా మారిందని ఆరోపించిన మేధావులు.. అన్నారం బ్యారేజి కూడా కొద్ది రోజుల్లో మేడిగడ్డలాగా కుంగిపోవడం ఖాయని పేర్కొన్నారు..