కామారెడ్డి (Kamareddy), నిజాంసాగర్ (Nizamsagar) చౌరస్తాలోని పాస్ పోర్టు కార్యాలయం (Passport Office)లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలోని పాస్ పోర్టు ఈ సేవా కేంద్రంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు, ఆఫీస్‌లో ఉన్న కాగితాలకు మంటలు అంటుకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలు, ఫైల్స్ కాలిపోయినట్లు సమాచారం.
ఇక పోస్టాఫీస్ పాత కార్యాలయంలోనే పాస్ పోర్టు ఈ సేవా కేంద్రం కొనసాగుతోంది. కాగా ఇది ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో, ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు..
అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైన కార్యాలయం మధ్య గదిలోనే మంటలు వ్యాపించడం.. అటు ఇటు వైపు ఉన్న గదుల్లో మంటలు వ్యాపించక పోవడంతో ఆశ్చర్య పోతున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి గురైన గదుల్లో కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.