– కామారెడ్డిలో బీజేపీ విజయఢంకా
– కేసీఆర్, రేవంత్ ఓటమి
– తీవ్ర ఉత్కంఠ నడుమ వెంకట రమణారెడ్డి గెలుపు
– హేమాహేమీలను ఓడించి రికార్డ్
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎప్పటికీ గుర్తుంచుకునేలా నిలిచిపోయింది. దీనికి కారణం కేసీఆర్, రేవంత్ అక్కడి నుంచి బరిలో నిలవడమే. ప్రచారంలో కామారెడ్డి ఏంతో పుణ్యం చేసుకుంది కాబట్టి కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని.. ఈ నియోజక వర్గం ఎక్కడికో వెళ్లిపోతుందని కేటీఆర్ డోలు కొట్టారు. అయితే.. కామారెడ్డి ఎక్కడికీ పోలేదని.. ఇక్కడి నుంచి పోటీ చేసిన కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ కు పోయారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి బీజేపీ అభ్యర్థి చరిత్ర సృష్టించారు. 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా నాన్ లోకల్ లీడర్స్ కావడం వెంకట రమణారెడ్డికి కలిసి వచ్చింది. ఒకవేళ కేసీఆర్, రేవంత్ ఎవరు గెలిచినా సొంత నియోజకవర్గాలకు వెళ్తారని ప్రజలు భావించినట్టు సమాచారం.
ఈ క్రమంలో కామారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. దీనికి తోడు స్థానికంగా ఉన్న పరిస్థితులు కూడా బీజేపీకి కలిసివచ్చాయి. మొత్తానికి, బీజేపీలో గెలుస్తారని భావించిన నేతలు ఓడిపోగా అంచనాలను మారుస్తూ కొందరు గెలవడం అంతుచిక్కని ఓటరు నాడికి నిదర్శనం.