ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికేతరులు ఎవరూ ఈనెల 28 నుంచి స్థానికంగా ఉండరాదనే నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) సోదరుడు కొండల్‌రెడ్డిని (Kondal Reddy) ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్‌గా తప్పుడు పత్రాలు సృష్టించి కామారెడ్డిలోనే ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఈ మేరకు బీఆర్‌ఎస్ నేతలు కొండల్‌రెడ్డిని అడ్డుకుంటున్నారు. కొండల్‌రెడ్డి స్థానికేతరుడని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా బీఆర్‌ఎస్ నేతలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
కొండల్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్‌గా తప్పుడు పత్రాలు సృష్టించి మూడు కార్ల కాన్వాయ్‌లో కొండల్‌రెడ్డి కామారెడ్డిలో తిరుగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌తో పాటు బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తంచేశారు. కొండల్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, గోనె శ్రీనివాస్ తదితరులు మద్దతు తెలపడం పట్ల నిరసనకు దిగారు. దీంతో చేసేది లేక కొండలరెడ్డి పీఏ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఉదయం నుంచి బీఆర్‌ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని కొండల్‌రెడ్డి ఆరోపించారు.