కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకొంది. సుభాష్ నగర్ (Subhash Nagar)లో పేదలు నివసిస్తున్న పూరి గుడిసెల్లో నేటి ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి, దాదాపు ఐదు ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు (Gas Cylinders) భారీ శబ్ధంతో పేలాయి. ఈ పేలుడు కారణంగా చుట్టు పక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి.
దీంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురైయ్యారు. మరో వైపు ప్రమాదం సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మంటలు ఆర్పేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. కాగా మంటలు ఇంకా అదుపులోకి రానట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ గుడిసెల్లో నివసించే కార్మికులంతా మేడారం జాతర (Medaram Jatara)కు కుటుంబసమేతంగా వెళ్ళినట్లు తెలుస్తోంది.
సమయానికి వారు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ కార్మికులు అంతా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి గత 20 ఏళ్లుగా ఇక్కడి పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. మరోవైపు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈమేరకు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా బాధితులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.