అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్ని ఓట్లకోసం సరికొత్త అవతారాలు ఎత్తి ప్రచారాలు నిర్వహిస్తుంటే.. ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు.. న్యాయాన్ని నమ్ముకుని, సమస్యలను ఏకరువు పెడుతూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా ఎన్నికలు అంటే ఎన్ని కోట్లు అనే స్థాయిలో మన వ్యవస్థ ఉన్న విషయాన్ని కొందరు ఇండిపెండెంట్ లు మరచినట్టు ఉన్నారని వీరిని చూస్తున్న వారు అనుకుంటున్నారు..
ఇకపోతే కరుణాకర్ (Karunakar) అనే యువకుడు కరీంనగర్ (Karimnagar)లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా (independent candidate) ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో చింతకుంట నుంచి కలెక్టరేట్ కు వరకు మోకాళ్లపై నడుస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించాడు. ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థి బెల్లపు కరుణాకర్, కరీంనగర్ నియోజకవర్గం అని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శిస్తూ.. స్థానిక సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి తనను గెలిపిస్తే.. అందరికీ అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపాడు.
తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో తనకు తెలుసు కాబట్టే.. ఎన్నికల బరిలో దిగానని చెప్పాడు. తన వెంట ఓ మైక్ పెట్టుకొని, ప్లకార్డును ప్రదర్శిస్తూ.. తనను గెలిపించాలని మోకాళ్లపై నడుస్తూ కరుణాకర్ ప్రజలను వేడుకున్నాడు. అయినా ఇది నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన రామరాజ్యం పాలన కాదు తమ్ముడు.. అడుగడుగునా రాబంధులు సంచరిస్తున్న రాక్షస రాజకీయం తమ్ముడు అని కరుణాకర్ కు కొందరు హితబోధ చేస్తున్నారు..