రానున్న సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(BJP) 370 సీట్ల లక్ష్యంతో ముందుకెళ్తోంది. సౌత్‌లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు పావులు కదుపుతోంది. బీజేపీ బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు(Prince of Mysore) యదువీర్ కృష్ణదత్త ఒడయార్(Yaduvir Krishnadatta Odayar)ను బరిలోకి దింపింది.
సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా(Pratap Simha)ను పక్కన పెట్టి మరీ యదువీర్(Yaduvir)ను రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది. మైసూర్-కొడగు(Mysore-Kodagu) ప్రాంతంలో మైసూర్ రాజవంశానికి ఉన్న ప్రాబల్యాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. గతేడాది వరకూ అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఎంపీ సీట్లు బాగా రాబట్టేందుకు ప్రయత్నాలను చేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్ చేసే యోచనలో ఉంది బీజేపీ.
ఇదే క్రమంలోనే బీజేపీ అధిష్టానం జేడీఎస్‌తో పొత్తు కుదర్చుకుందనే వార్తలు వెలువడుతున్నాయి. మైసూర్ రాజ వంశీకుల ప్రభావం ఆ సమీప ప్రాంతాల్లోని లోక్‌సభ సీట్లపై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కనపెట్టి మైసూర్ యువరాజు యదువీర్‌ను బీజేపీ బరిలోకి దింపినట్లు స్పష్టమవుతోంది.