బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)పై కర్ణాటక సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తెలంగాణలో బీజేపీ పనైపోయిందని అన్నారు. బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాషాయ పార్టీకి నాలుగైదు సీట్లు వస్తే అదే చాలా ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా గర్జన సభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు నియోజక వర్గాల్లో గెలుస్తారని అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఓడిస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. అవినీతి డబ్బుతో అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రధాని మోడీ తెలంగాణకు వందసార్లు వచ్చి ప్రచారం చేసిన బీజేపీ గెలిచే అవకాశం లేదని వెల్లడించారు. ఈ ప్రధాని మోడీని నమ్ముకుని బీజేపీ ఎన్నికలకు వెళ్తోందన్నారు. కర్ణాటకలో ప్రధాని మోడీ 48 చోట్ల సభలు నిర్వహించారని, ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిందన్నారు. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని విమర్శించారు.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో కూడా ఆయన అన్ని అబద్దాలే చెప్పారని అన్నారు. నరేంద్ర మోడీలాగా అబద్ధాలు మాట్లాడే ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదని ఫైర్ అయ్యారు. ఈ నెల 30 తేదీ కోసం ప్రజలు ఆసక్తగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాబోతుందన్నారు.