కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పాతరేసిందని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అసలు అభివృద్ధి జరగనట్లుగా కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ గౌరవించిందన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పారని గుర్తుచేశారు. సీఎం స్థాయిలో ఉండి రేవంత్‌రెడ్డి హరీశ్‌రావు, కేటీఆర్‌లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను ఖండిస్తున్నామన్నారు. రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే హామీలను నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేలా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీకి అరువు తెచ్చుకున్న నాయకుడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ చచ్చిపోయిందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నిరుద్యోగులకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామం పెట్టిందని, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, సిలిండర్ రూ.500 హామీ ఏమైందని ప్రశ్నించారు. అబద్ధాల హామీలతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో చచ్చిపోయిందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్లమెంట్ ఉభయ సభల్లో అనేక పోరాటాలు చేసిందని, బీఆర్ఎస్ ఎంపీలు 4,658 ప్రశ్నలు పార్లమెంట్లో అడిగారని గుర్తు చేశారు. రేవంత్ మాత్రం కుట్రలు చేసే విధంగా మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బోగస్ హామీలపైనే చర్చ నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ నిలబడుతుందని కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు.