కార్తీక మాసం (Karthika Masam) మొదటి సోమవారం పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు కార్తీకశోభతో కళకళలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే గోదావరి(Godavari), కృష్ణా(Krishna) నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం, శ్రీకాళహస్తి, రాజమహేంద్రవరం, విజయవాడ, భద్రాచలం వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు దీపాలు వెలిగించి వేడుకుంటున్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్, కోటిలింగాల ఘాటు వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు.
శ్రీశైలంలో అర్చకులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో 365 వొత్తులను వెలిగించుకొని మహిళలు ఉపవాసాలను ఆచరిస్తున్నారు.
అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది.