తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక శోభతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి(Karthika pournami) సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాల వద్ద భక్తిశ్రద్ధలతో దీపారాధన చేస్తున్నారు. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీంతో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
భద్రాచలం, రాజమహేంద్రవరంలో గోదావరి, విజయవాడలో కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, ద్రాక్షారామం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న బ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు కిటకిటలాడుతున్నారు.
అదేవిధంగా హనుమకొండలోని వేయిస్తంభాల గుడి వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. అలంపూర్ శైవక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. జోగులాంబ ఆలయం కార్తిక శోభ సంతరించుకున్నది. బాల బ్రహ్మేశ్వరస్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ‘శంభో శంకర..’ అంటూ శివనామస్మరణను జపిస్తున్నారు.