తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR )మహారాష్ట్రపై గురి పెట్టారు. క్రమంగా ఆ రాష్ట్రంలోనూ తెలంగాణ మోడల్ పథకాలను ప్రవేశపెట్టి.. తమ పార్టీని పటిష్టం చేయడానికి ఉద్యమిస్తున్నారు. తెలంగాణాలో అమలు చేస్తున్న రైతు బంధు వంటి స్కీమ్స్ ను అక్కడ కూడా అమలు చేయాలని, తద్వారా బీఆర్ఎస్ (BRS) ఉనికిని దేశవ్యాప్తం చేయడానికి మరాఠా రాష్ట్రాన్ని నాందిగా చేసుకుని దూసుకుపోవాలన్నది ఆయన ప్లాన్. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఆయన.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని మరాఠా రాష్ట్రంలో వ్యాప్తి చెందింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. మా రాష్ట్ర మోడల్ ని మీ రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు హైదరాబాద్ వచ్చిన మరాఠీలకు, అలాగే ఆ రాష్ట్రంలో తాను పాల్గొన్న సభలకు వచ్చిన ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఒక రాష్ట్రంలో తన ఐడెంటిటీతో పాపులరైన ఒక పార్టీ పేరు మార్చుకుని మరో రాష్ట్రంలో కాలు మోపడానికి జరుగుతున్న యత్నాలను ఇటు తెలంగాణవాసులు, అటు మహారాష్ట్ర వాసులు నిశితంగా గమనిస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రజలు అంగీకరిస్తారా అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో సందేహాస్పదమని అంటున్నారు. అయితే ఈ సందేహాలను పట్టించుకోకుండా కేసీఆర్ ముందుకు వెళ్ళడానికే యత్నిస్తున్నారు. మహారాష్ట్ర,తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లోగడ పోటీ చేశారు.
అంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి అన్నదొకటి ఉందని మరాఠాలకు తెలియజేశారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఈ ఫైట్ సాగింది. గత కొన్ని నెలలుగా ఇందుకు సంబంధించి పార్టీ తన యత్నాలను ముమ్మరం చేసింది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేరు. అక్కడ రాజకీయ శూన్యత అన్నది లేదు. శివసేన లోని రెండు వర్గాలు, ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలున్నారు. ఆ పార్టీల్లో చీలికలు తెచ్చి బీఆర్ఎస్ ముందుకు పోగలుగుతుందా అన్నది అనుమానమేనంటున్నారు. ఏమైనా తమ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 10 వేలరూపాయల చొప్పున సాయం చేస్తున్నదని, సేద్యానికి ఉచితంగా విద్యుత్తు, నీరు ఇస్తోందని, ఇంకా ఈ విధమైన పథకాలను తాము అమలు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించుకుంటున్నారు. బహుశా ఇందువల్లే మహారాష్ట్రలో ఇప్పటికే ఓటర్లు బీఆర్ఎస్ పట్ల మొగ్గు చూపుతున్నారని ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ తెలిపారు. ఈ రాష్ట్రంలో తమ పార్టీ క్రియాశీలక పాత్ర వహిస్తోందని, ముందు ముందు ఇంకా దూసుకుపోతుందని, అందుకు ఇంకెంతో కాలం పట్టదని ఆయన అంటున్నారు. మహారాష్ట్రలో ఎన్నో పార్టీలున్నా ఇవి రైతులకు చేసిన మేలు ఏదీ లేదన్నారు. అందువల్లే మహారాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆదరించడం మొదలుపెట్టారన్నారు.
ముఖ్యంగా విదర్భ, పశ్చిమ మహారాష్ట్రవంటి బోర్డర్ ఏరియాల్లోని రైతులు, సామాన్య ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పిన ఆయన తెలంగాణ, మహారాష్ట్రలు వెయ్యి కిలోమీటర్ల బోర్డర్ ను షేర్ చేసుకున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర లోని 15 జిల్లాల్లో మా పార్టీ ఉనికి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షలమంది సభ్యులు మా పార్టీలో ఉన్నారు అని హిమాంశు తివారీ వివరించారు.
కేసీఆర్ 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు, యువకులు, ఓబీసీలు, రైతులు, ఇతర వర్గాలవారు సభ్యులుగా ఉన్నారు. కేసీఆర్ మేనల్లుడు కె. వంశీధర రావు మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్-చార్జిగా నియమితులయ్యారు. నాగ్ పూర్ డివిజన్ కో-ఆర్డినేటర్ ను కూడా ఆయన నియమించారు. మహారాష్ట్రలోని ఆరు డివిజన్లలో ఒక్కో దానికి కో-ఆర్డినేటర్ నియమితులయ్యారు. ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ బల్కి కుమారుడు భగీరథ్ బల్కి వంటి పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరినట్టు హిమాంశు తివారీ వివరించారు. నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయం ప్రారంభమైందని, మరి కొన్ని నెలల్లో ముంబై, పూణే, ఔరంగబాద్ లలోనూ ఇవి ప్రారంభమవుతాయన్నారు.