తాగి పడుకునే కేసీఆర్(Kcr)ను అల్లాతో పోలుస్తారా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అవుతాయని ఇటీవల ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పటాన్ చెరులో గురువారం పర్యటించిన ఆయన మాట్లాడారు.
వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆలయాల్లో పూజలు చేసే సాధుసంతులు, పూజారులు బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం మత పెద్దల వలే సాధువులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు రామజన్మ భూమి గుర్తుకొస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నేతలు మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లిం సమాజం వారికి ఓట్లు గుద్దుతున్నారన్నాని బండి సంజయ్ అన్నారు. మసీదుకు పోయినా.. రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదన్నారు. కనీసం అల్లా గురించి వారికి తెలియదన్నారు. టోపీ పెట్టుకొని సీతారాముడికే దండం పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ అవసరం అనుకుంటే రామాయణాన్ని మార్చి అయోధ్యలో రాముడు పుట్టలేదని తిరిగి చరిత్ర రాస్తాడని వ్యాఖ్యానించారు.
బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు మెట్రో ఇచ్చేందే ప్రధాని మోడీ అన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను మోసం చేశాడని ఆరోపించారు. యువతకి ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారని విమర్శించారు. మోడీ 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు.