తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (CM) కేసీఆర్ (KCR) సతీమణి కల్వకుంట్ల శోభ తిరుమల (Thirumala) శ్రీ వారిని దర్శించుకున్నారు. తిరుమలలో స్వామి వారికి జరిగే అర్చన సేవలో శోభ పాల్గొన్నారు. శ్రీవారికీ తలనీలాల మొక్కులను చెల్లించుకున్నారు కేసీఆర్ సతీమణి.
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో టిటిడి వేద పండితులు వేద ఆశీర్వాదం, స్వామివారి తీర్థప్రసాదాలు కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందించారు. వైకుంఠ వాసుని దర్శనాంతరం దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర (srikalahasti) స్వామి దర్శనానికి వెళ్లారు కేసీఆర్ సతీమణి. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారికి దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి శాసనసభ్యుడి కుమార్తె పవిత్ర రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకొన్నారు. అనంతరం ఆలయ అధికారులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను, దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీ ఆలయ కార్యనిర్వహణ అధికారి సాగర్ బాబు, ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఆయన సతీమణి ఆలయ సందర్శనాలు చేయడం విశేషం..