కాంగ్రెస్ (Congress) 50 ఏండ్ల పాలనలో చేయని పనులన్నీ…పదేండ్ల బీఆర్ఎస్ (BRS) సర్కార్ పాలనలో చేసి చూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంపెనీల టర్నోటర్ రూ.11 వేల కోట్లుగా ఉండేదని వెల్లడించారు. కానీ తమ హయాంలో కంపెనీల టర్నోవర్ రూ.30 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.
కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రం ఉండి వుంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదని తెలిపారు. కొత్తగూడెం ప్రాంతానికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు 70 శాతం పనులు పూర్తి అయ్యాయనన్నారు. ఈ నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూములకు పట్టాలు మంజూరు చేశామన్నారు.
తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అందువల్ల మళ్లీ తానే వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు బూతులు తిట్టుకుంటారని అన్నారు. విపక్షాలు అబద్ధపు ఆరోపణలను చేస్తాయని, వాటిని పట్టించుకోవద్దన్నారు. ఓటు వేసే ముందు అభ్యర్థి గుణగణాలను చూసుకోవాలని ఓటర్లకు సూచించారు.
అభ్యర్థి వెనుక ఏ పార్టీ ఉంది, ఆ పార్టీ వైఖరి.. చరిత్ర చూసి ఓటేయాలని సూచనలు చేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వైఖరి వల్లే కేంద్రానికి 49 శాతం అప్పనంగా కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదని పేర్కొన్నారు.. తెలంగాణ వచ్చిన వెంటనే 3 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని వెల్లడించారు.