డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత కేసీఆర్ (KCR) ప్రభుత్వానిదని కాంగ్రెస్ (Congress) నేత విజయశాంతి (Vijayashanthi) అన్నారు. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తామంటూ తెలంగాణ ప్రజలను కేసీఆర్ దారుణంగా మోసం చేశారని మండిపడ్దారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో ప్రజలు గెలవాలంటే చేతి గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేసీఆర్ సర్కార్‌ను ఇంటికి పంపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ కే పట్టం కట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు అనర్హులు, బీఆర్ఎస్ నేతలకే దక్కాయన్నారు. పథకాల్లో అర్హులకు బీఆర్ఎస్ సర్కార్ మొండి చేయి చూపిందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అభివృద్ధి అంటే ఏంటో తాము చూపిస్తామని వెల్లడించారు. నిర్మల్‌లో ఇన్ని రోజులుగా మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి చుట్టూ ఉన్న చెరువులను సైతం కబ్జా చేశారని ఆరోపణలు గుప్పించారు.