తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS)నేతలు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తూ.. బరిలో నిలిచిన అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ (KTR) కార్యకర్తల్లో, నేతల్లో మనోధైర్యాన్ని నింపేలా పలు సూచనలు ఇస్తుండగా.. తాజాగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా పార్టీ నేతలు, ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యే అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మౌత్ టాక్‌తో గాబరా పడొద్దని తెలిపారు..
సర్వేలో విజయం మనకే అనుకూలంగా ఉందన్న కేసీఆర్.. ఆదమరిస్తే ప్రమాదమని హెచ్చరించారు. పార్టీ శ్రేణులంతా పోలింగ్ ముగిసే వరకు రిలాక్స్ కాకుండా ఉండాలని తెలిపారు. ప్రతి ఓటు పార్టీకి కీలకమన్న కేసీఆర్.. 30న పోలింగ్ ముగిసేవరకు కేడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్‌కు ప్రతి ఓటరువచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం రప్పించే ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు చెప్పినట్టు సమాచారం.
ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు కేసీఆర్. సుదూరపు నియోజకవర్గాల అభ్యర్థులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థుల పనితీరు, ఇతర పార్టీల స్థితిగతులపై సంబంధిత వర్గాలతో కేసీఆర్ (KCR)చర్చించారు. ఈనెల 28న ప్రచారం ముగుస్తున్నందున ప్రచార మెళకువలు నేతలకు వివరించారు.
పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలపై బీఆర్ఎస్ అనుసరించాల్సిన పద్ధతులను కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాల్సిన తీరుపై కేసీఆర్ సూచనలు చేశారు. అదే విధంగా విపక్ష పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలపై ఆరా తీసినట్లు సమాచారం.. తాజా సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నందున ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని కేసీఆర్ నేతలను ఆదేశించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే భరోసా ఇవ్వడంతో పాటు పార్టీ కేడర్ ప్రతి గడపకూ వెళ్లేలా చూసుకోవాలని కేసీఆర్ వివరించినట్టు సమాచారం..