– పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్ వ్యూహం
– రేపు ఎమ్మెల్యేగా ప్రమాణం
– సారు రాకపై అందరి దృష్టి
– వీల్ చైర్ లో వస్తారని విశ్లేషకుల అంచనా
– ఎన్నికల ప్రచారంలోనూ ఇదే ఫార్ములా..!?
– గతంలో వీల్ చైర్ వ్యూహంతో మమతా బెనర్జీ సక్సెస్
– అదే ఐడియా కేసీఆర్ కు వర్కవుట్ అవుతుందా?
దేశ రాజకీయాల్లో తెలంగాణ (Telangana) ప్రత్యేకం. ఇక్కడ స్థానిక సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే, బీఆర్ఎస్ (BRS) రెండు పర్యాయాలు పాలించగలిగింది. మొన్న కాంగ్రెస్ (Congress) కూడా ఇదే అస్త్రంతో గెలవగలిగింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలకు కొదవే లేదు. ముఖ్యంగా కేసీఆర్ (KCR) ఈ అంశంలో టాప్ స్కోరర్. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తిన ప్రతీసారి ఆయన చేసిన సెంటిమెంట్ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గమ్మునుండిపోయిన కేసీఆర్.. మరోసారి సింపథీ అస్త్రంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల ముందుకు రానున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఒకచోటే గెలిచారు. కానీ, ఇప్పటిదాకా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. ఫాంహౌస్ లో జారిపడి తుంటి ఎముక ఆపరేషన్ వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. గురువారం తెలంగాణ అసెంబ్లీకి రానున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు గెస్ చేస్తున్నది ఏంటంటే.. కేసీఆర్ అసెంబ్లీకి వీల్ చైర్ లో వస్తారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవ్వాల్సిన సమయం ఇది. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఇప్పుడప్పుడే కీ రోల్ పోషించే అవకాశం లేదు. కానీ, కీలక సమయం కావడంతో వీల్ చైర్ లో అయినా ప్రజల ముందుకు రావాలని డిసైడ్ అయినట్టు అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ ఊపుమీదుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని.. బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారని.. అందులోభాగంగానే వీల్ చైర్ లో ఎన్నికల ప్రచార పర్వానికి తెర తీయనున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇలా అయితేనే సెంటిమెంట్ వెల్లువెత్తి లబ్ధి చేకూరుతుందన్నది ఆయన వ్యూహంగా విశ్లేషిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ అధినేత మమతా బెనర్జీ కూడా ఇదే ఫార్ములాను వాడి సీఎం చైర్ అందుకొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఇలాగే వ్యవహరించి.. 17 లోక్ సభ స్థానాల్లో కొన్నైనా కైవసం చేసుకొనేందుకు ఈ ప్లాన్ చేసి ఉండొచ్చని అంటున్నారు.
అధికారంలో ఉన్న హస్తం పార్టీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటున్నారు. గతంలో కేసీఆర్ చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆలస్యం.. అమృతం.. విషం.. మాదిరిగా లేటైతే జరగాల్సిన నష్టం జరుగుతుందని భావించిన కేసీఆర్.. వీల్ చైర్ లో అయినా అటు జనంలో ఇటు పార్టీ నేతల్లో ఉండాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. అదీగాక, సింపథీ కూడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. కానీ, ఇది ఎంతవరకు లాభం చేకూర్చుతుందో చూడాలి.