పార్లమెంట్ ఎన్నికల కేసీఆర్(EX CM KCR) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో ప్రకటించారు. ఇంకొంచెం కష్టపడితే మరో మూడు సీట్లు సాధిస్తామని అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. కాస్త కష్టపడితే మరో మూడు స్థానాల్లో గెలుస్తామని కేడర్‌కు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని, దానిని అనుకూలంగా మార్చుకోవాలని గులాబీ శ్రేణులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర (BUS TOUR) చేపట్టాలని, దీనివలన జనం నుంచి మంచి స్పందన వస్తుందని సూచించారు. ఈనెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభిస్తామని.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్ షోలు నిర్వహిద్దామని తెలిపారు.
ఉదయం రైతుల వద్దకు వెళ్లాలని, సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు, కార్నర్ మీటింగులు ఉంటాయని తెలిపారు. కీలకమైన ఖమ్మం, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభలు నిర్వహిస్తామని వెల్లడించారు. మేజర్‌గా రైతు సమస్యలపై స్పందించాలని.. పోస్టు కార్డు ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో లక్ష కార్డులు రాయాలని ఆదేశించారు. రైతుల కల్లాల దగ్గరికి వెళ్లి రూ.500 బోనస్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ హామీల వైఫల్యంపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.