బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధికారం కోల్పోయాక బయటకు రావడమే మానేశారు. ఒకప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి నాన్ స్టాప్‌గా ప్రతిపక్షాలను ఉతికారేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకో మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా మారడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఓవైపు కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అవ్వడం, మరోవైపు సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడటం ఆయన్ను మానసికంగా కుంగదీసినట్లు తెలుస్తోంది.
అయితే, పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీకి ఎలాగైనా జవసత్వాలు తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వారి పక్షాన పోరాడేందుకు సిద్ధమయ్యారు. వారం కిందట ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు సమస్యలపై ఉద్యమించేందుకు సిద్దమయ్యారు. ఒక్కసారి గతంలోకి వెళితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేముందు కేసీఆర్ ప్రకటించారు. కానీ మళ్లీ 2023లో ఎన్నికల ముందు దానిని అమలు చేశారు.
అప్పటివరకు రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నాకేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రూ.2లక్షల రుణమాఫీ, 500 బోనస్, రైతు బీమా అమలు చేయాలని కేసీఆర్ గట్టిగా కోట్లాడితే అది ఆయన మెడకే చుట్టుకునే అవకాశం లేకపోలేదని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ వ్యూహత్మకంగా వ్యవహారిస్తున్నారా?
లేదా కోరికోరి అధికార పక్షం చేతిలో బంధీ కాబోతున్నారా? అని పలువురు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కేసీఆర్ ఒకప్పుడు ఏం మాట్లాడినా ఎవరూ ఎదురుచెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన ఏది మాట్లాడిన ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిపోతుంది. పదేళ్ల అధికారంలో ఉన్న మీరు ఏంచేశారు? ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారు? పోరాటాలకు సిద్ధమవుతున్నారు? మీ హయాంలో రైతులను పట్టించుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.