ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Delhi CM Aravind Kejriwal)అరెస్ట్‌పై జర్మనీ(Germany) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడింది. జర్మనీపై కేంద్ర విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులని పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చంటూ ఆ ప్రకటనలో ప్రస్తావించారు. ఈ ప్రకటన పెను దుమారం రేపింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శనివారం ఢిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిపించి నిలదీసింది. మా అంతర్గత విషయాల్లో మీ జోక్యమేంటంటూ మండిపడింది.
కాగా, కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్టు చేయగా శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు తొమ్మిదిసార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఒక్కసారి కూడా ఆయన విచారణకు రాలేదు. చివరికి హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం దక్కలేదు. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పడంతో ఈడీ అధికారులు ఆయనను నిమిషాల వ్యవధిలోనే ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.