కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిఫా వైరస్ బారిన పడి ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 130 మందిలో ఈ వైరస్ ను గుర్తించారు. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ వ్యాప్తి చేందకుండా వుండేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కోజికోడ్ ప్రాంతంలో నలుగురిలో నిఫా వైరస్ ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోజికోడ్ లోని ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్ మెంట్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. నిఫా వ్యాప్తి చెందకుండా పలు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
నిఫా ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, ఆఫీసులను మూసి వేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యాప్తి రేటు తక్కువగా వుంటుందని, కానీ మరణాల రేటు మాత్రం అధికంగా వుండే అవకాశం ఉందని హెచ్చరించారు.
గతంలో 2018, 2021లోనూ నిఫా వైరస్ వ్యాప్తి చెందింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 130 మంది ఈ వైరస్ బారిన పడినట్టు ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నిఫా అలర్ట్ నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణెకు చెందిన వైద్య నిపుణుల బృందం కెరళాకు చేరుకోనుంది. కోజికోడ్ లో మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనుంది.