ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవిధంగా చెప్పాలంటే కుటుంబసభ్యుల్లో అన్నా చెల్లెలు, అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. సీఎం జగన్పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి అయిన అన్న కేశినేని నాని(Keshineni Nani) తమ్ముడు, టీడీపీ అభ్యర్థి అయిన కేశినేని చిన్ని(Keshineni Chinni) విమర్శ, ప్రతివిమర్శలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా విజయవాడ(Vijayawada) లోక్ సభ టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని.. కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ధ్వజమెత్తారు. తాను ఎంపీ స్టిక్కర్ తగిలించుకుని తిరుగుతున్నానని నాని ఆరోపించాడని దీన్ని పోలీసులు ఎక్కడా నిరూపించలేదన్నారు చిన్ని. తాను ఏ బ్యాంకులోనూ డబ్బులు ఎగ్గొట్టలేదని, అలాగే ప్రజలనూ మోసం చేయలేదని చిన్ని స్పష్టం చేశారు.
కేశినేని నాని సొంత కార్మికులు జీతాలు ఇవ్వలేదని గుంటూరు లేబర్ కోర్ట్ లో కేసులు పెట్టారని గుర్తుచేశారు. కేశినేని నానికి మైండ్ పని చేయడం లేదు.. అంటూ విమర్శించారు. అమరావతి కావాలని తానే అంటాడని, మరోసారి తానే వద్దంటాడంటూ మండిపడ్డారు. మూడు సంవత్సరాల నుంచి తాను ప్రజలకు సేవ చేస్తున్నాని చెప్పుకొచ్చారు.
తానెక్కడా కేశినేని నాని తమ్ముడని చెప్పుకుని తిరగలేదని వెల్లడించారు. 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కేశినేని నాని కార్యాలయానికి ఎన్నడూ వెళ్లలేదన్నారు. మీడియా ముందూ తాను ఆయన తమ్ముడినని మాట్లాడలేదన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం కావాలని రైతులు కోరుకుంటున్నారని, అందుకే 33వేల ఎకరాల భూములను ఇచ్చారని తెలిపారు. వారికి లేని బాధ నానికి ఎందుకని అన్నారు.