కేశినేని బ్రదర్స్(Keshineni Brothers) మధ్య వార్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని(MP Keshineni Nani) ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని)(Keshineni Shivanath) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడమే మీదే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనని చెప్పారు.
ఫేస్బుక్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని చిన్ని పేర్కొన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తాయని.. తిరువూరులో జరిగిన ఘటన కూడా అలాంటిదేనని తెలిపారు. అవన్నీ టీకప్పులో తుపానులా తొలగిపోవాల్సిందేనని చెప్పారు. తిరువూరు సభకు లక్ష మంది పైగా ప్రజలు వస్తారని దీమా వ్యక్తం చేశారు.
తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని ప్రస్తావించారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. అధినేత ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని వివరించారు. మరోవైపు, నాని, చిన్ని వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో తిరువూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.